Saturday, February 10, 2018

*వివాహముహూర్తము* సంపూర్ణ వివరణ

*వివాహకాలము*:-పుట్టినది మెుదలు 17 సంవత్సరములపైని బేసి సంవత్సరమునందుగాని.16 యేండ్లలపల గోదానవ్రతము నాచరించని పురుషునకు 5వ సంవత్సరమునుండి బేసి సంవత్సరమునగాని వివాహ మెునరించవలెను.స్త్రీలకు సరిసంవత్సరములే మంచివనీ పుత్రసంతాన ప్రదములని  చెప్పుదురు.కాని స్త్రీలయందు పది సంవత్సరములు పైబడువరకు రజోదర్శన మవ్వదు గావున ఆనాటి నుండి బేసిన గుణించిన యే సంవత్సరమందైననూ పెండ్లి జేయవచ్చునని శాస్త్రము.

*యెాగ్య మాస నిర్ణయము*

సూర్యడు లగ్నాది లగ్న ద్వితీయ,తృతీయ,సప్తమ,లాభస్థానములగు రాసులు నున్నప్పుడు పుష్యమాసముగాక తక్కిన మాసములందును వైశాఖమాసము,జేష్ఠ,మాఘ,ఫాల్గుణ మాసములందు వివాహము చేయుట ఉత్తమము.కార్తీక,మార్గశిరములు మధ్యమములు.ఆషాఢమాసము.రవి ,మిధున,కర్కాటకములందుండినకూడదు.చైత్రమాసమున సూర్యుడు మేషమునందు ప్రవేశించినచో వివాహములు చేయవచ్చును.
*వివాహ నిషిద్థ తిథి నిర్ణయం*

కృష్ణపక్షమున ఏకాదశినుండి అమావాస్య వరకు గల అయిదు తిథులనూ,శుక్లపక్షమున పాడ్యమియునూ పెండ్లికి పనికిరావు.ఉభయపక్షమలందునుగూడా 6,8,12 తిథులూ,మూడు తిథులు గూడిన రోజున,పగలు 12 గం"దాటినాకా,అర్ధరాత్రి వేళ,26, నుండి 4 ఘడియలవరకూ,భద్రకరణమందునా,4 యుగాదులందునా,14 మన్వాదులందునా వివాహము చేయటతగదు.

*వివాహ వార నక్షత్ర నిర్ణయము*

వివాహమునకు ప్రశస్తమైన వారములు బుధ గురు,శుక్రవారములు.మధ్యమవారములు.ఆది,శనివారములు,పనికిరానిది,దోషయుక్తమైనది మంగళవారము మరణము సూచించును.సోమవారము పెండ్లిచేసినచో అది పునర్వివాహమునకు దారితీయును.పాపగ్రహయుక్తములుగాని నక్షత్రములు రోహిణి,మృగశిర,మఘ,ఉత్తరాత్రయము,హస్త,స్వాతి,అనూరాధ,మూల,రేవతి తారలలో పాపగ్రహములులేని తారనెంచుకొని వివాహము జరుపవలెను.

*వివాహమునకు తగని గ్రహరాశులు*

సూర్యసంచారములో ఆరుద్ర నాల్గవ పాదమారంభించి స్వాతి నాల్గవ పాదమువరకున్న,గురుడు సింహరాశియందుగాని సింహరాశ్యంశలలో గాని యున్నప్పుడున్న పరిఘాయెాగములో పూర్వభాగమమను,పుట్టిన మాసమందును,జన్మలగ్నమునుండి యెనిమిదవ లగ్నమందునను,జన్మ నక్షత్రమందునను పెండ్లిచేయరాదమ.

*గురు శుక్ర చంద్రులు -బాలత్వాది నిర్ణయము*

శుక్రుడు ప్రాగుదయకాలమాది మూడురోజులు,తిరిగి యదయమాది పదిరోజులు బాలుడనబడును.ప్రాగస్తమయాది పూర్వము పదిరోజులు వృద్ధుడగును.గురూదయాది పక్షము దినములు బాలుడున్న  అస్తమయాదిగా నైదురోజులు వృద్ధుడగును.చంద్రగ్రహము కృష్ణపక్ష ద్వాదశి మెుదలుగా చతుర్ధశి వరకు వృద్ధుడునుశుద్ధపాడ్యమి చివరి ఘడియ మెుదలు విదియ తిథిలో పదిగడియలు వరకు బాలుడనబడును.

*చంద్ర గురు శుక్రాస్తమయము*

గురు,శుక్ర,చంద్రగ్రహముల యస్తమయ కాలములందున వివాహములు గావించిన వరుడు మరణించును.ఆమూడు గ్రహములు బాల్యదశా కాలమైన వధువు వ్యభిచారిణియగును.వారికి వృద్ధస్థితి గల్గిన కాలమున వధువు మరణించును.వారు దోషులైనచో నుపనయనమున వటుడు మరణించును.

*మౌఢ్యకాల ఫలము*

వింధ్య పర్వతమునకు దక్షిదిశాస్థిత దేశవాసులగు వారు మాత్రము గురుశుక్రులు బాల్య -వృద్ధాప్యతత్వము లందున్న 3 దినములు విసర్జించి,మిగిలిన రోజులలో శుభకర్మ లోనర్చవచ్చునని కొందరి మతము.

*మూడు జ్యేష్ఠల రూప నిర్ణయము*

వరుడుగాని,వధువుగాని యిద్దరూ జ్యేష్ఠులైనచో జ్యేష్ఠమాసమందుగాని,జ్యేష్ఠా నక్షత్రమందుగాని,వివాహము గావింపరాదు.దానినే త్రిజ్యేష్ఠాదోషమందురు.సీమంత సంతానమునకు వధూవరులు జ్యేష్ఠులు కాకున్న పెండ్లి చేయరాదని,దీనియభిప్రాయము.జేష్ఠ వధూవరులైననూగాని ఆ దంపతులకు రాశి మిత్రత్వముగాని,మాసాధిపులమైత్రిగాని బలమైనదైనచో శుభకరమగునని మన్వాదులభిప్రాయపడుచున్నారు.
*సశేష దోషములు*

వధువు జన్మలగ్నమునకుగాని,జన్మ చంద్రలగ్నమునకుగాని,యెవిమిదింట గాని,పండ్రెండవయింటగాని,గురుడున్నప్పుడు వివాహము గావించిన వధువు వితంతువు వగును.వరుని జన్మలగ్నమునకు మూడు,ఆరుస్థానములందు గురుడున్నప్పుడు వివాహమైనచో వధువు మరణించును.లగ్నమునకు గురుడు చతుర్థ దశమ స్థానములందుగానియున్న సమయములో వివాహ సమయములో వివాహమైనచో వధూవరుల దుఃఖములపాలగుదురు.ఆ గురుడే ద్వితీయమందుగాని పంచమందుగాని,సప్తమమందుగాని,నవమమందుగాని,యేకాదశమందుగాని,యున్న వధూవరులకు మంచి శుభములు గల్గించువాడగును.రవిగాని,గురుడుగాని,చంద్రుడుగాని,దోషము గలవారైనచో వారికి జపాదులు గావించి వివాహము గావించవలెను.

*అన్నదమ్ములు-వారి వివాహములు*

అక్కచెల్లెండ్రను-ఒకనికే నీయరాదు.అక్కచెల్లెండ్రను.అన్నదమ్ములకిచ్చుటయున్న తండ్రియెుకడు తల్లులిద్దరైన యన్నదమ్ముల కిచ్చుట యున్న,యిద్దరు కన్యలకొకే లగ్నములో వివాహము చేయుటకున్న కొడుకు కూతురు కొకే లగ్నములో వివాహము చేయుటకున్నూ తగదు.ఇరువురు సోదరులకొకే లగ్నములో నొకే యింటిలో పెండ్లిగాని యుపనయనముగాని చేయరాదు.

*విశేష విషయములు*

కూతురు పెండ్ల వెనుక కొడుకు పెండ్లి చేయవచ్చును కొడుకు పెండ్లి చేసిన పిమ్మట కూతురు పెండ్లిగాని యింకొక కొడుకునకు  వుపనయనముగానీ గావించరాదు.కొడుకువడుగైన తరువాత కుమార్తె వివాహము చేయవచ్చును.కొడుకు పెండ్లియైన పిమ్మట ఆర నెలలలోపున యేకోదరుల వివాహములు యేడాది తేడాలోనైనా చేయవచ్చును.

*శాస్త్రయుక్తం*

(ఉపర్యుక్తమట్లు ఏకోదరుల వివాహమున కొకేయేడాదేని తేడాయుండ వలెను.కాని)ఫాల్గుణమాసమందొకరికి,చైత్రమాసమందొకరికి నెలతేడాలోనే శుభకార్యము లొనర్చుట శాస్త్రసమ్మతమే యగును.ఏలయన ఫాల్గుణముతో ఆ యేడాదిముగిసి,చైత్రములో నూతనవర్ష మారంభమగును.కాని నెలతేడాలోనే సంవత్సరకాల భేదము పాటించినట్లగును.

*వివాహములు చుట్టరికములు*

యజమాని మెుదలు నాల్గవతరము పురుషుడు,ఆరవతరము స్త్రీనిగాని,అయిదవతరము మగవాడు అదే తరమందలి యాడుదానినిగాని వివాహమాడరాదు.నాల్గవతరము పురుషుడు నాలుగైదు తరములు కన్యల పాణిగ్రహణము చేయవచ్చును.అట్లే మూడవతరమందలివాడు,మూడవతరమందలి దానిని చేపట్టవచ్చునని కొందరునూ,చేపట్టరాదని మరికొందరునూ చేప్పుచున్నారు.ఏది ఏమైనను,ఇట్టినియమములెల్ల ఏడుతరములపై ముగిసెడివే కావున పెద్ద పట్టింపు లేదనియూ అందురు ఏ అభిప్రాయ ప్రకారము మసలిననూ ఇట్టి యుద్వాహములందు పంచమ స్త్రీ పంచమ పురుష వివాహమునకు తండ్రివరుస తగదనీ,తల్లి వరుసదే,జరుపవలెననీ,కొందరి మతము.
*గండ నక్షత్రములు*

అడువారు మూలానక్షత్రమందుగాని,ఆశ్లేషా నక్షత్రమందుగాని జన్మించినవారు అత్తమామలకు దోషము చేయువారగుదురు.మూల 4 వ చరణము అశ్లేషప్రథమపాదము విశేష దోషప్రదము స్త్రీ జ్యేష్ఠ నక్షత్రములో జన్మించిన పెనిమిటియన్నగారికి (బావగారికి)మరణము జెందజేయునదగును.విశాఖ నక్షత్రములో జన్మించిన మరిదిని చంపుదగును.మగవానికి కూడ యిా దోషము వర్తించునందురుగాని,పైదోషభూయిష్ఠత స్త్రీలకే తప్ప పురుషులకు వర్తించదని ఈ మూలగ్రంధ కర్తఅభిప్రాయము.

*గండదోషములు*

ఈ యిరువదొక్క దోషములు పంచాంగ శుద్ధి కాకపోవుట సూర్యసంక్రమణములు కతైరకాలము,పాపషడ్వర్గ దోషసంబంధమగు నవాంశము,కుజాష్టమము బృగుషట్కము,లగ్నాషట్కము,అష్టమచంద్రుడు,చంద్రసగ్రహదోషము,షడష్టరిప్పగత చంద్రుడు,దుర్ముహూర్తము,ఖర్జూరికాసమాంఘ్రి గ్రహము,ఉత్పాతము.క్రూరయుగ్దిష్ణ్యము,అశువిద్ధము విషయుతలగ్నము,లగ్నాస్తమయము,గండాంతము,వ్యతీపాతము,వైధృతియివిసన్నియు గండదోషములనబడును.పరిశీలించి లగ్నాదులుంచి శుభములు గావింపజేయవలయును.

*సంక్రమణ దోషములు*

పంచాంగమున శుద్ధికానిదోషము లేవనగా తిథి,వార నక్షత్ర,యెాగ,కరణములు మంచివి గాకపోవుట,పంచాంగశుద్ధి దోషములందురు.సూర్య సంక్రమణ దోషములనగా,మేషము,కర్కాటకము,తుల,మకరరాశులలో సూర్యుడు ప్రవేశించుకాలము,దానికి ముందు వెనుక ముప్పదిగడియల,రవిసంక్రమణ కాలమునకు పదహారు గడియలు విడువదగును.అట్లు విడువనిచో యిాదోషములు సంక్రమించును.

*షడ్వర్గులు అధిపతులు*

మేషాది ద్వాదశ రాశులును,వాటి అధిపతులును తెలియజేయబడుచున్నవి సూర్యాది సప్తగ్రహములలో సూర్యేందు లిరువురునూ ఒక్కొక్కరాశికి,ఇతరులు రెండేసి రాశులకు అధిపతులు.మేష వృశ్చిక రాశులకు బుధుడును,ధనుర్మీనములకు బృహస్పతియు మకర కంభములకు శనైశ్చరుడునూ అధిపతులుకాగా,సింహరాశి కొక్కదానికి సూర్యుడునూ కర్కాటకరాశి కొక్కదానికి చంద్రుడును.అధిపతులు,ఈ రీతిగా ద్వాదశరాశ్యాధిపతుల నెరుగునది.
*గ్రహ రాశులు -శుభాశుభములు*

రాసులు మూడురకములు,చరరాసులు,స్థిరరాసులు,ద్విస్వభావరాసులు లనబడును.చరరాసులు మేష,కర్కాటక,తులా,మకరములు స్థిరరాసులు వృషభ,సింహ,వృశ్చిక,కుంభములు,ద్విస్వభావరాసులు మిథున,కన్యా,ధనుర్మీనములు,లగ్నమున రెండు భాగములు గావించుట,యందోక భాగము హోరా సూర్యహోర-రెండవ భాగము చంద్రహోర,ఇది బేసిరాసులలో గుణించదగినది.సమరాసులలో  మెుదటిది చంద్రహోర,రెండవదది సూర్యహోర హోరాధిపతులు సూర్యచంద్రులు గాదా! రవిచంద్రులు శుభ గ్రహములన్న రాసులు శుభరాసులు,మిగిలినవి క్రూరరాశులగును.

*ద్రేక్కాణవర్ణనము*

ద్రేక్కాణమనగా లగ్నమును మూడు భాగములు గా చేయుట,వానిని ప్రథము,ద్వితీయ,తృతీయ ద్రేక్కాణము లందురు.మెుదటి ద్రేక్కాణమునకు లగ్నాధిపతియు,ద్వితీయ ద్రేక్కాణమునకు పంచమాధిపతియు,తృతీయద్రేక్కాణమునకు నవమాధిపతియు యజమానలందురు.మరొక విధముగా లగ్నధిపతి ఏకాదశాధిపతి,ద్వాదశధిపతి (కొందరు నవమాధిపతి)యనియు లగ్న పంచమ,నవమాధిపతులు,చరలగ్నమునకును,స్థిరలగ్న ద్రేక్రాణాధిపతులు నవమ,లగ్న పంచమాధిపతులనియు ద్విస్వభావలగ్నమునకు పంచమ,నవమ లాభాధిపతులు ద్రేక్కాణధిపతులనియు కొందరందురు.

*లగ్నము - ద్వాదశాంశము*

నవాంశ యనగా లగ్నమును తొమ్మిది భాగములు చేయుట,మేష,సింహ,ధనుస్సులకు మేషాదిగను,కర్కాటక,వృశ్చిక, మీనములకు కర్కటాకదిగను,వృషభ,కన్యా,మకరములకు మకరాదిగను,తులా,మిథున,కుంభములకు తుల మెుదలుగను నవాంశాధిపతులుగ  గుణించ లగ్నమందు పండ్రెండు భాగములు చేసినచో పండ్రెండన భాగాధిపతియే ద్వాదశాంశాధిపతి యగును.

*త్రిశాంశ - దానివిధానము*

లగ్నమును 30 భాగములుగా చేయుటకు త్రింశాంశమందురు.ఇందు అంగారకుడు,శనియ చెరి 5 అంశలకును,బృహస్పతి 8 అంశలకును,7 అంశలకు బుధుడును,5 అంశలకు శుక్రుడు ఈ వరుసను మేషాది బేసిరాశులకు అధిపతులు.వృషభాధి సమరాశుల లగ్నములకగు 30 అంశలందునూ,5 అంశములకు శుక్రుడు,7 అంశములకు బుధుడూ,బృహస్పతి 8 అంశలకూ,శని కుజులు చెరియెుక 5 అంశలకును అధిపతులగుదురు.వీరలను త్రిశాంశాధిపతులని యందురు ఇందు రవి చంద్రులు లేకుండుట గమనార్హము.

*షడ్వర్గ విధానము*

షడ్వర్గ మనగా నారు భాగములు కూడికనే యట్లందురు.లగ్న,హోర,ద్రేక్కాణ,నవాంశ,ద్వాదిశాంశ,త్రింశాంశల కూడికయే షడ్వర్గవిభాగము,మూడు భాగములు చేయుట ద్రేక్రాణము,తొమ్మిది భాగములు చేయుట నవాంశ, పన్నెండు భాగములు చేయుట ద్వాదశాంశ,ముప్పది భాగములు చేయుట త్రింశాంశ యనబడును.
*పుష్కరాంశ నిర్ణయము*

మేషమునకు యిరువదొకటవ భాగము,వృషభమునకు పదినాల్గవ భాగము,మిథునముకు,24వ భాగము,కర్కాటకమున 7వ భాగము,సంహమునకు 21వ భాగము,కన్యకు,14వ భాగము,తులకు 24వ భాగము, వృశ్చికమునకు 7వ భాగము,ధనస్సునకు 21వ భాగము,మకరమునకు 14వ భాగము,కుంభమునకు 24వ భాగము,మీనమునకు 7వ భాగము పుష్కరాంశలుగా నిర్ణయించిరి,పుష్కర కాలమున కీషడ్వర్గలు శుభగ్రహవర్గలైన శుభఫలముల నిచ్చును.చరలగ్న ప్రథమాంశలు,స్థిరలగ్న పంచమాంశలు ద్విస్వభావ నవాంశలు వర్గోత్తమాంశలు.

*అంశలు -శుభాశుభములు*

కన్యా,తుల,మిధునాంశలును,ధనుస్సులో పూర్వార్థమును సంపదలనూ,సత్పుత్రులను నొసగును.వీటి చరమాంశలు అశుభప్రదములు.వర్గోత్త మాంశము రాశ్యంతరములో కలయప్పుడు శుభప్రదము.వివాహితులకు అష్టమరాశి భాగమును.ద్వాదశంశమును అశుభములు,కావున,వాని పూర్వర్థములకంటె వేరయిన యంశలు కునవాంశలు యనీ వృషభాంశము సర్వశుభప్రదమనీ కొందరి మతము.

*నవాంశల ప్రత్యేక ఫలము*

వధువు మేషాంశయైన విధవయు వృషభాంశయైన పశుసమృద్ధి,మిధునాంశయైన ధనపుత్రవతి,కర్కాటకాంశయందు జారిణి సింహాంశయందు తండ్రియింటనే యుమడునది యు కన్యాంశయందైన గుణవతి ధనవతియు,తులాంశయందైన  పుత్రవతి,వృశ్చికాంశయందైన దరిద్రురాలగును.
ధనురంశ ప్రధమ భాగము ధనవంతురాలగును.రెండవ భాగము జారిణి,మకరాంశమైన వితంతువు ,కుంభాంశమైన రోగపీడత,మీనాంశమైన నపుత్రవతి ,విధవ,దరిద్రరాలగును.లగ్నముకంటే శుభ నవాంశ బలవత్తరమైనది.
*వివాహ లగ్నము - వాటి దోషములు*

వివాహ లగ్నమునకు కుజుడు యెనిమిదింట నుండరాదు.దానినే కుజాష్టదోషమందురు.దాని వలన మృత్యువు సంభవించును.శుక్రుడారింటనున్న భృగుషట్కమని మహాదోషము.మృత్యుప్రదమగునది యగును.కుజ,శుక్రులు,నిర్జితులై.నీచమందుగాని,శత్రుక్షేత్రములందు గాని యున్నచో,నస్తంగతులైనచో మంచిదని కొందరిమతము,అది కూడినంత మంచిది కాదని గ్రంథకర్త యభిప్రాయము.
*కర్తరి(కత్తెర)దోష నిర్ణయము*

నిశ్చిత లగ్నమునందు రెండు పాపగ్రహములుండి,అందొకటి పన్నెండింట మరియెుకటి రెండింటాయుండి 12 నందలి గ్రహము యధావిధిగా యుండి,రెంండింట నున్న పాపగ్రహము వక్రించినచో ఆ రెంటినడుమదైన లగ్నమునకు కర్తరీ దోషము కలుగును.ఇది మరణకాలమగును.అట్టి కర్తరీదోషసమయమున పాపగ్రహో భయమునడుమ.చంద్రుడుండెనేని అది అధిక కర్తరీ దోషమని కొందరందురు.ఉపర్యుక్తములైన పాపగ్రహద్వయము రెండునూ వక్రించియున్నప్పుడూ,వక్రతవీడియున్నప్పుడూ,రెండింట గ్రహము సజావుగానుండి, పన్నె డింట గ్రహము మాత్రమే వక్రించి యున్నప్పుడూ లగ్నమునకీ కర్తరీ దోషము లేదని చెప్పబడుచున్నది.

*వివాహ లగ్నాష్టము దోషనిర్ణయము*

జన్మ లగ్నమునకు జన్మకాల చంద్రరాశకి అష్టమ లగ్నము విశేషనష్టదాయకము.అది యెంత శాస్త్రో క్తమైన సద్గుణములతో నున్ననూ విడిచి పెట్టుట ముఖ్యము.అష్టమలగ్నాధిపతి వివాహలగ్నధిపతి వివాహలగ్నమందుడినచో దంపతులకు కీడు గల్గును.జన్మరాశి అష్టమమందు చంద్రుడున్న దరిద్రము విచ్చును.జన్మలగ్నము జన్మ సంబంధ ద్వాదశలగ్నము పనిచేయవు.పెండ్లిండ్లలో యా లగ్నమందు ముహూర్తము పెట్టిన దంపతులకు హాని కల్గించును.
*శేష దోషములు*

చంద్రుడు శుభలగ్నమునకు షష్ఠస్థానమందుగాని,యష్టమమందుుగాని,ద్వాదశస్ఖానమందుగాని,యున్నచో అది దోషముగా నెరిగి యట్టి ముహూర్తము లుంచరాదు.చంద్రనకు యితర గ్రహముస సంబంధమున్న సగ్రహ దోషమందురు.చంద్రుడు శుభులతో గూడిన దోషిగా నిర్ణయించనక్కలేదు.

*సగ్రహ చంద్రదోషము*

వివాహ మెునరించు లగ్నములలో చంద్రునితో రవి కలిసిన దరిద్రము సంభవించును.కుజుడు కలిసినచో మరణము,బుధునితో కూడినచో గ్రొడ్రాలితనము,గురుడు కలిసిన దౌర్భాగ్యము శుక్రుడైన సవతి ప్రవేశించును.శనియున్న దంపతులకుసంపదలుండవు.రాహువున్న కలహము వచేచును.కేతువున్నచో వధువునకు దుఃఖబాధ గల్గించును.కొందరి యభిమతము యిట్లున్నది.చంద్రునితో కలిసిన గ్రహముచంద్రుడున్న నక్షత్రములో నుండుకున్నను  లేక నక్షత్రపాదములు వ్యత్యయములుగా నున్నను దోషమంటదని అందురు.

*ముహూర్తభేధములు*

ప్రతిదినమునకు ముహూర్తములు పదిహేనుగా నుండును.1.రుద్రము,2.ఉగరము,3.మిత్రము,4.పిత్ర్యము.5.వసువు.6.వారము.7.విశ్వేరేతము,8.విధి,9 బహ్మ,10.ఇంద్రము,11.ఇంద్రహుతాశనము,12.దైత్యము,13.వరుణము,14.అర్యము,15.భగము. ఈ 15.ముహూర్తము లందునా 1,2,4,11,12,15,యివి మహోగ్రములై నవి.ఈ 6 ముహూర్తములందు శుభములు జరుపరాదు.మిగిలిన 9 మంచివి.

*రాత్రి ముహూర్తములు*

ప్రతి రాత్రియు 15ముహూర్తము లుండును.అందు.1.ఈశ్వర,2.అజచరణ,3.అహిర్భుధ్న్య,4.పూష,5.నాసత్య,6.అంతక 7.వహ్ని 8.ధాత,9.శశి,10.ఆదిత్య,11.జీవము,12,అచ్యుతము,13.అర్కము 14.త్వష్టము,15.సమీరణము,అను పదిహేను రాత్రి ముహూర్తములు.ఇందు 1,2,6,7,శుభఫలములనీయవు.నక్షత్రాధిపతులు,ముహూర్తధిపతులు ఫలములు సమానముగా నిత్తురు,ఏనక్షత్రమే యేశుభములకు తగునో యానక్షత్రాధిపతియున్న ముహూర్తము శుభఫలము నిచ్చును.

*వార దుర్ముహూర్తములు - వాటి దోషములు*

ఆదివారము అర్యమ ముహూర్తము  దోషము,సోమవారము బహ్మసురములు,మంగళవారము పగలు దైత్యము రాత్రి అగ్నిదోషము,బుధవారము అభిజిత్తు,గురువారము దైత్యము అహియును,శుక్రవారము బ్రహ్మపిత్ర్యములు,శనివారము రుద్రాహియివి వార దుర్ముహూర్తములు పేర్లు.కాని ఈ 12 దుర్ముహూర్తములందు వివాహది శుభకార్యములు జరుపరాదు.
*హోరాధిపతులు*

ఉదయాది ఘడియలు రెండుచే గుణించినైదుచే భాగింపగా వచ్చిన శేషము హోరయగును.ఏ వారమునకైన హోర కావారాధిపతి యెుదటిహో రకధిపతి.రెండవ హోరకు ఆరవగ్రహము,ఎనిమిదవ హోరకు యేడవగ్రహము క్రమముగా హోరాధిపతులగుదురు.అర్థరాత్రినుండి హోర చుడవచ్చును యని కొందరన్నను యది సరికాదు.హోరకాలము 2 1/2 ఘడియలు.అనగా 5 అరఘడియలు యిా అయిదు అరఘడియలకూ ప్రత్యేకముగా అంతరోవ్వారాధిపతులుందురు ఉదాహరణమునకు సూరహోర లోని అయిదు  అరఘడియలకూ- సూర్య,చంద్ర,అంగారక,బుధ,బృహస్పతులు అధిపతులు.అట్లే చంద్రహోరలోని 5 అరఘడియలకు వరుసగా చంద్రాంగారక,బుధ,గురు,శుక్రులధిుతులు.అట్లే తక్కిన హోర లెరిగి మసలుకొన వలెనని భావము.
*ఖర్జూరచక్రము - అశుభయెాగములు*

ఖర్జూరపు టాకువలె నిలువుగీత గీసి దానిని నడ్డముగా గీతలతో యిరువదారు గదులుగావించి,శిరస్సున శ్రీని  వ్రాసి చుట్టును యిరవదారు నక్షత్రములు వ్రాయగా సూర్యచంద్రలొక రేఖపైనున్న ఖర్జూరదోషము.వధూవరుల కాదక్షసము ప్రమాదము గొనివచ్చును.వారిద్దరొక రేఖయందున్న పరస్పర వీక్షణముగాదు.నాల్గవ పాదమున నొక గ్రహము రెండు మూడు పాదములందు,రెండు గ్రహములున్న పరస్పర వీక్షణ మగును.అదియు శుభము.

*పాదవీక్షణ చక్రము*

అశ్వినీ నక్షత్రము విష్కంభమునకు అశ్లేష వ్యతీపాతమునకు,మృగశిర శూలకు,మఘా నక్షత్రము పరిఘకు మూలానక్షత్రము గండమునకు,అనూరాధ అతి గండమునకు,పుష్యమి వజ్రమునకు,వ్యాఘాతమునకు,చిత్తవైధృతికిపై చక్రమున వ్రాయదుగును.ఈ యెాగములు వివాహదులకే శుభములు.

*గ్రహణో త్సాతములు*

గ్రహణాది ఉత్పాములు గల్గిన యేడురోజులు  మాత్రము శుభము చేయదగదు.అవి వచ్చిన నక్షత్రములందు శుభము చేసిన మరణము వచ్చును.ఆరు నెలలు వదలవలెను.గ్రహణమర్ధగ్రసమైన వారమురోజులు ముందు వెనుకలు గ్రసమైన సర్వగ్రస్తమైన పదునాల్గురోజులు, గ్రహణ నక్షత్రము సంపూర్ణమైనచో అర్ధసంవత్సరము,సగమైన మూడు మాసములు వదిలి తరవాత చేయవలయునమ.

*ఉత్పాతములు - నక్షత్రములు*

ఉత్పాత,భూకంపములు,తోకచుక్కలు పొడుచుట గ్రహణాదులు వచ్చుట.వీనిని యుత్పాతదులందురు.ఇవి  పట్టిన నక్షత్రములకు మూడురకములు పేర్లుగలవు.జ్వలితము,ధూమితము,భస్మము యనబడును.పాపగ్రహమునిల్చిన నక్షత్రము మజ్వలిత,మందురు.దానికి వెనుకనున్నది భస్మమందురు.ఇవి వాహహాదులకు పనికిరావు.ఇవి పాపగ్రహమున్న రాశికినీ,దానిముందు వెనుకలున్న  రాశులకు యిా నామములు చెల్లును.వీనియందు శుభగ్రహ సంబంధ బలమధికముగా నున్నచో వివాహదులు చేయువచ్చును.

*పంచశలాక  చక్రము*

ఒకచోట కాగితముమీదగాని,పెద్ద పలకమీదగాని, నిలువు,అడ్డముగా నైదైదుగీతలు గీసి మూలందు రెండురెండు గీతలు చొప్పున నాల్గు మూలలుగీసి యిాశాన్యదిశగా నడ్డముగా గీయబడిన గీతనుండి నక్షత్రములు వ్రాసి పాపగ్రహ సంబంధముగు వేధలులేని నక్షత్రములందు శుభకార్యములు గావించదగును.ఇవి పంచశలాక చక్రము.

*నక్షత్ర విఘడియలు - వాటిదోషములు*

ఈ క్రింది వివరింబడిన నక్షత్రములు గల విఘడియలకంటె నదనముగా నాల్గు విఘడియలు చేరుటచే అవి విషమమగును.కావున అట్టిసంఖ్యతో నవి వివాహములకు తగువు.కాన వివరించడమైనది.అశుభము గూర్చును.

అశ్వని -50
భరణి -24 
కృత్తర -30
రోహిణి -40
మృగశిర -14
ఆరుద్ర -21
పునర్వసు -30
పుష్యమి -20
ఆశేష -32
మఘ -30
పుబ్బ -20
ఉత్తర -18
హస్త -21
చిత్త -20
స్వతి -14
విశాఖ -14
అనూరాధ 10
జేష్ఠ -14
మాల -56
పూర్వాషాఢ -24
ఉత్తరాషాఢ -20
శ్రవణం -10
ధనిష్ఠ-10
శతభిషం -18
పూర్వభాద్ర -16
ఉత్తరాభాద్ర -24
రేవతి -30

*లగ్నాధిపతులు - వారి శుభాశుభములు*

లగ్న నావాంశాధిపతిగాని,శుభగ్రహ వీక్షణముగాని,నవాంశాలగ్నాధిపతుల విత్ర గ్రహములచేగాని,చూడబడుచుండు వివాహలగ్నముగాని,వారుండు శుభలగ్నముగాని,వరునకు శుభము అట్లువారి సంబంధము లేనిచో హని వచ్చును.యెన్నవయంశము లగ్ననవాంశమగునో యాలగ్నమందున్న నవాంశ దస్తాంశము.ఆయస్తాంశ యా నవాంశాధిపతిచేగాని శుభగ్రహ సంబంధదృక్కుచేగాని  చూడబడినను వారితో కలిసినను వధువునకు శుభము.వ్యతిరేకమైన హాని ప్రదము.
*నక్షత్రరాశులు - గండంతాములు*

ఈ క్రింద చెప్పబడిన నక్షత్ర జంటలు,అశ్వని-రేవతులు,ఆశ్లేష -మఖలు,జేష్ఠ -మూలలు,మెుదటిదాని చివరి నాల్గు ఘడియలు,రెండవదాని మెుదట నాల్గు ఘడియలు కలిపి యెనిమిది ఘడియలు నక్షత్ర గండాంతములు.ధనుమర్మీన, మేష -సంహరాశుల మెుదటి ఆరుఘడియలు,కర్కాటక - వృశ్చిక,మీనరాశుల చివర ఆరు ఘడియల రాశి గండాంతములు.వర్గోత్తమాంశలతో చేరిన శుభకర్మ లాచరించరాదు.

*తిథులు - గండాంతదోషములు*

శుద్ధపాడ్యమి ప్రారంభము నుండి బేసి తిథులయందునకు వరుసగా నంద,భద్ర,జయ,రిక్త,పూర్ణమలను పేర్లుగల సంజ్ఞలున్నవి.ఆ తిథులయందు మెుదట రెండు ఘడియలు,పూర్ణతిథులకు తుదిరెండేసి ఘడియలు తిథిగండాంత ముల.ఇవి మృత్యవును గూర్చును.కాన యిా ఘడియలందు వివాహాదులు జరుపరాదు.

*వ్యతీపాతవై ధృతిదోషములు*

వ్యతీపాత,వైధృతులు రెండు మహాదోషముల సమయములందు వివాహాదులు చేయదగదు.

*వివాహలగ్నము - గ్రహబలము*

తమ ఉచ్చస్థానములందుగాని,స్వక్షేత్ర,స్వాంశమిత్ర,క్షేత్రమిత్ర,నవాంశయందున మూడుమంచి గ్రహములతో కూడుకొని 3,6,11 స్థానములందు పాపగ్రహయుక్తమై  వర్గోతమాంశహితమై ,పంచేషికాబలసంయుతమై,- వివాహ లగ్నము ఎంత బలముకలదైననూ -పూర్వోక్తములైన 21 మహాదోషములలో ఏ ఒక దోషముతో కూడినప్పటికి అది శుభకర్మలపట్ల మారక మగునని భావము.శుక్రుడు వివాహమునకుంచిన లగ్నములో ఆరింటనుగాని, కుజుడు యెనిమిదింటనుగాని యున్న దోషములు,చంద్రడు షష్ఠవ్యయములందున్నను దోషమే.శుభస్థానములైన లగ్న,ద్వితీయ,చుతుర్థ,పంచమ,నవమ,దశమ,స్థానములందు శుభగ్రహము లుండగా వివాహలగ్నము ప్రశస్తమగును.మూడు,ఆరు,ఏకాదశములందు పాపగ్రహములున్నను శుభఫలితములిచ్చును.వివాహలగ్నము బలముగా నిర్ణయించవచ్చును.
*జామిత్ర దోషములు*

రవి వివాహ లగ్నమున కేడింట నున్న వైధవ్యము వచ్చును.చంద్రుడున్న సవతి వచ్చును కుజుడున్న మరణము బుధుడున్న పుత్రహాని గురుడున్న నాశనము,శుక్రుడున్న రోగము,శనియున్న మృత్యువు,రాహువున్న ఖైదు వధూవరులకు ప్రాప్తించును.కొందరు శుక్లక్ష చంద్రుడున్న సప్తమమున శుభగ్రహమున్న శుభమందురు.

*సంధికాలము - విడువదగిన కాలములు*

సంవత్సరముల చివర సంవత్సరము క్షయ సంవత్సరము,దాని సంధికాలము పదునైదురోజులు,మాససంధులకు నైదురోజులు,తిథులకు - వారములకు - నక్షత్రములకు - యెాగములకు సంధ్యయందు నాల్గు ఘడియలు,కరణ సంధి యందురెండు ఘడియలు,రాశిసంధ్య యందు ఒక్క ఘడియయు,నుదయాస్తమానుల సంధ్యల మూడు ఘడియలున్న,అధ్దరాత్రి సమయమున్ను శుభకార్యములకు పనికిరావు.

*వర్జిత కాలములు*

వర్షము,మేషము,ఉరుములు,మెరుపులు,పడు సమయములందుగాని,సూర్యచంద్రులు పరివేషములు గట్టిన సమయములందుగాని.సూర్యుడు తెల్లరంగు ధరించి యున్నప్పుడుగాని,ఇంద్రధనస్సు ప్రతి సూర్యచంద్రుల దిగ్ధామము లందుగాని,తోకచుక్క,పెద్దగాలి,దుశ్శకునములు,దుస్వప్నములు,దుర్భాషణములు వినబడునప్పుడు శుభకర్మలు చేయరాదు.
*ఇతర దోషములు*
.

నక్షత్రముల పడు సమయము,పిడుగులుపడు సమయము,గురు శుక్రుడు ఒకరికొకరు రేండింటనుండు సమయము,దిక్కులమంటలు వేశ,యమకంటకము,అర్ధప్రహారము,ఉపగ్రహములు,శుభగ్రహమేధలు,ఖరయెాగము శూన్యతిథి వారనక్షత్రములు దగ్థయెాగముగల తిథి వారనక్షత్రములు కుమటి,మూగ,చెవుడు,గ్రుడ్డి యనబడు గుర్తులు గల తిథి వారదులు పెండ్లకి పనికిరావు.

*సశేష దోషములు*

దోషములకు పరిమితిలేదు,కొన్నివివరించుచున్నాను.ఈ దోషములు అంగ,వంగ,కళింగ,సౌరాష్ట్ర,మగధ,అవంతి,కాశ్మీర,గౌడ,ద్రావిడ,సాల్వ,మథుమ,కురు,మ్లేచ్ఛ,బాహ్లికాది దేశములకు నియమితముగా చెప్పబడినమి,వీటిని దాటిన వాటిని గురించి వీటితో పనిలేదు.

*శుభస్థానములు*

బుధ,గురు,శుక్ర గ్రహములు స్వస్థానోచ్చలో నున్నప్పుడు,మూల త్రికోణములందు న్నప్పుడు,మిత్రక్షేత్రములందున్నప్పుడు,స్వక్షేత్రములలో నున్నప్పుడు లగ్నమందుగాని,చుతుర్థ,పంచమ,నవమ,దశమస్థానములందుగాని,బుధ,గురు,శుక్రులలో యే యెుక్కరైనగాని కొంతమందిగాని యున్నచో యెన్ని యితర దోషపరం పరలు పది లక్షలనైననూ పారద్రోలి శుభములు గూర్చుననుటకు సందియము లేదు.
లగ్నమునకు తృతీయ షష్ఠ,ఏకాదశస్థానములందు పాుగ్రహము బలవంతుడైయున్నగాని,లగ్న,చతుర్ధ,పంచమ,భాగతదశమస్థానములందు లగ్నాధిపతి బలవంతుడైయున్నను,లగ్నమునకు పంచేష్ఠికబలముకలదై యున్నను వేయి దోషములు హరించును.చంద్రుడు నిశాలగ్నమందు యేకాదశమందున్నను,పగటిలగ్నమందుగాని,యేకాదశమందుగాని రవి యున్నచో పెక్కుదోషములు పోగొట్టుదురు.

*ప్రత్యేక విషయములు*

వివాహము మెుదలగాగల శుభకార్యలగ్నములకు యిరువదొక్క మహా దోషములు లేకుండుచూచి యితరదోషములను శాస్త్రపద్ధితిగా నిర్ణయించి,దోషములున్న లగ్నములు విడిచి శుభకర్మ లాచరించునట్లు చేయవలయును.ఏదోషమూలేకుండా బ్రహ్మయైనా ముహూర్తము నుంచజాలడు శుభగ్రహబలము చూచినచో యా దోషములు తగ్గిపోవును.

No comments:

Post a Comment