Wednesday, September 12, 2018

బుధుడు జ్యోతిషం

బుధుడు నపుంసక గ్రహం. మిశ్రమ రుచుల కారకత్వం కలిగిన వాడు. ఇరవై వయసున్న వారిని సూచిస్తాడు. వర్ణం ఆకు పచ్చ, జాతి వైశ్య, అధి దేవత విష్ణువు, గుండ్రని ఆకారం, పరిమాణం పొడుగు, ప్రకృతి కఫ, వాత, పిత్తములు కల వాడు. శరధృతువును ఉత్తర దిక్కునూ, సూచిస్తూ, పృధ్వీ తత్వం కలిగిన వాడు, గ్రహ సంఖ్య అయిదు, రత్నం పచ్చ, లోహం, ఇత్తడి, కంచు, గుణం రజో గుణం కలిగిన వాడు. లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. ఆశ్లేష, మూల, రేవతి నక్షత్రములకు బుధుడు అధిపతి. మిధున కన్యా రాశులకు అధిపతి. బుధుడు కన్యారాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ ఉచ్ఛ స్థితిని పొందుతాడు. మీనరాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ నీచను పొందుతుంది. కన్యారాశిలో పదిహేను ఇరవై డిగ్రీలు మూల త్రికోణము ఔతుంది. బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్రులు. సింహరాశి, వృషభరాశి, తులారాశులు మిత్ర స్థానములు. చంద్రుడు శత్రువు. కర్కాటక రాశి శత్రు స్థానం. బుధ గ్రహ దశ పదిహేడు సంవత్సరాలు. బుధుడు ఏడవ స్థానం మీద మాత్య్రమే దృష్టిని సారిస్తాడు.

బుధుడు స్వభావరీత్యా శుభుడు, తత్వము భూతత్వం, గ్రహ స్వభావం, ఒంటరిగాపాపి శుభగ్రహములతో చేరిన శుభుడు. జీవులు పక్షులు, గ్రహ స్థానం క్రీడాస్థలాలు, జలతత్వం జలభాగం, ఆత్మాధికారం వాక్కు, పాలనా శక్తి రాకుమారుడు, గ్రహపీడ బంధువుల వలన బాధలు, గ్రహ వర్గం శని, గృహంలో భాగములు పఠనా మందిరం, దిక్బలం తూర్పు, నివాస ప్రదేశములు జనావాసాలు, చెట్లు ఫలములు లేని చెట్లు, పండ్లు సీమ చింత, ధాన్యం పెసలు, పక్షులు చిలుక, గబ్బిలం, జంతువులు మేక గొర్రె, ఇతర వస్తువులు నగలు, మిశ్ర లోహములు. వస్త్రం తడి వస్త్రం, దేవ వ్ర్గం శైవ, గ్రహ వేదం అధ్ర్వణ వేదం, గ్రహ గోత్య్రం ఆత్రేయ, అర్ధశుభుడు, అవతారం బుద్ధావతారం, గ్రహవర్ణం తాళపత్ర వర్ణం, వారం బుధవారం, మన స్థితి సాత్వికం, బలంగా ఉంటే వాక్చాతుర్యం బుద్ధి జ్ఞానం, ఋషి నారాయణుడు.

*బుధుడి ప్రభావం*
బుధ ప్రభావితులు పొట్టిగా ఉంటారు. చురుకుగా ఉంటారు. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వృద్ధాప్యంలో కూడా యవ్వనంతో కనిపిస్తారు. దీర్ఘాలోచ కల వారు, మేధా సంపత్తి కల వారుగా ఉంటారు. సందేహ ప్రవృత్తి కలవారుగా ఉంటారు. విషయ జ్ఞానం అందు ఆసక్తులు. రచయితలు, కళాకారులుగా ఉంటారు. తలనిప్పి, తల నొప్పి, అల్సర్ వ్యాధి పీడితులయ్యే అవకాశం ఉంది. ప్రసార రంగంలోనూ, కళారంగంలోనూ, గణికులుగా ఉంటారు.

*బుధుడి కారకత్వాలు*
బుధుడు వాక్కుకు, మేనమామకు, మేనకోడలికి, మేనల్లుడికి, మాతా మహులకు కారకత్వం వహిస్తున్నాడు. ఉపన్యాసంలో నైపుణ్యం, లలిత కళలు, గణిత శాసత్రం, వాణిజ్యం, అర్ధ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వ్యాపార శాస్త్రం, వ్యాకరణం, జ్యోతిషం, వివిధరకాల భాషలు, శిల్పి, మంత్రం, తంత్రం, వివేకం, పుస్తక పచురణ, గ్రంథాలయం మొదలైన వాటికి కారణం. దౌత్యం, వైద్యం, మధ్యవర్తిత్వం మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. వైష్ణవులు, వైష్ణవ భక్తి, వైష్ణవాలయం మొదలైన వారికి కారకత్వం వహిస్తాడు. నాభి, నరము, స్వరపేటిక, చర్మమును సూచిస్తాడు కనుక నరముల బలహీనత, మూర్చ, చ్చెముడు, మెదడుకు సంబంధించిన వ్యాదులకు కారకత్వం వహిస్తాడు. సకల విధ ఆకు కూరలు, కాయ కూరలకు కారకత్వం వహిస్తాడు. సభా నిర్వాహకులు, ప్రజాసంబంధిత వ్యవహారికులు, ప్రచారకులు, ఉపన్యాసకులు, ఉపాద్యాయులు, న్యాయవాదులు మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. వాక్సంబంధిత వృత్తులకు బుధుడు కారకుడు. మేధావులు, పండితులు, చరిత్రకులు, గుమస్తాలు, చిత్రకారులు, రాయబారులు, విద్య, గణికులు, దస్తూరి, నవలలు, వ్యాసాలు, కల్పితాలు, చిన్న పుస్తకములు, యువకులు, ప్రకటనలు, వాహనములు, వ్యాపారం, నిఘంటువులు, సత్యవాదముకు బుధుడు కాకత్వం వహిస్తాడు.

*బుధుని రూపురేఖలు*
బుధుడు దుర్వాదళ దేహకాంటి కలిగిన వాడు. నాలుగు భుజములు కలిగి పీత వస్త్రములను ధరించి పసుపు పచ్చని మాలా ధారణ చేసి గద, కత్తి, డాలు ఆయుధములను చేత పట్టి ఉంటాడు. బుధుడు సింహమును అధిరోహించి ఉంటాడు.
*బుధుడు రాశులు*
బుధుడు కన్యారాశిలో 15 డిగ్రీలలోఉచ్ఛ స్థిలోనూ, మీన రాశిలో 15 డిగ్రీలలోపరమ నీచ స్థితిలోనూ ఉంటాడు. కన్యారాశి బుధునికి త్రికోణ స్థానం. శత్రు క్షేత్రం కర్కాటక రాశి. విషమ క్షేత్రం కర్కాటక రాశి. మిత్ర క్షేత్రములు వృషభ రాశి, తులా రాశి, సింహ రాశి. సములు కుంభరాశి, మకర రాశి, మేష రాశులు, వృశ్చిక రాశులు, ధనస్సు, మీనములు. రాశిలో 30 డిగ్రీల వరకు శుభఫలితం ఇచ్చాడు. బుధుడు ఒక రాశిలో ఒక నెల రోజులు ఉంటాడు. దిన చలనం ఒక డిగ్రీ. లగ్నంలో దిగ్బలం చెందుతాడు. గోచార రీత్యా బుధుడు 2, 4, 6, 11 స్థానములలో శుభుడు. గోచార రీత్యా అశుభ స్థానములు 1, 3, 5, 7, 8, 9, 12. వేధ స్థానములు 3, 5, 9, 12. దశాసంవత్సరములు పదిహేడు.

*బుధుడు మరికొన్ని విషయాలు*
బుధుడు సూర్యుడితో చేరి 1, 4, 8 స్థానాలలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి చక్రవర్తి స్థానానికి ఎదిగి భోగభాగ్యాలను అనుభవిస్తారు.
బుధుడు మిధునంలో ఉన్నప్పుడు అధికారప్రాప్తి, కన్యలో ఉన్నప్పుడు ఉన్నత పదవి పొందుతారు.
*ద్వాదశ స్థానములలో బుధుడు*
లగ్నములో బుధుడు ఉన్న జాతకుడు దీర్ఘాయువు, మృదుమధుర వాక్కులు పలికేవాడు, హాస్యచతురుడు ఔతాడు.
ద్వితీయస్థానమున బుధుడు ఉన్న జాతకుడు స్వశక్తితో ధనమును సంపాదించు వాడు, ఆకర్ష్ణీయంగా మాటాడు వాడు, ప్రస్పుటముగా మాటాడు వాడు, భోజన ప్రియుడు ఔతాడు.
తృతీయమున బుధుడు ఉన్న జాతకుడు ధైర్యశాలి, శౌర్యం కల వాడు, సమ ఆయుషు కలవాడు, మంచిసోదరులు కలవాడు, త్వరితంగా అలసట పొందువాడు ఔతాడు.
చతుర్ధభావమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, హాస్యవిశారదుడు, భూమి కలవాడు, మిత్రులు కలవాడు, ధాన్యసమృద్ధి కలవాడు, ఐశ్వర్యం కలవాడు, సంతోషం కలవాడు ఔతాడు.
పంచమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, సుఖవంతుడు, శైర్యవంతుడు, మంత్రవిద్యాభిలాషి, సంతానవంతుడు ఔతాడు.
షష్టమ భావమున బుధుడు ఉన్న జాతకుడు వివాదాస్పదుడు, క్రోధము కలవాడు, నిష్టుర వాక్కులు పలుకు వాడు, శత్రువులను నాశనం చేయువాడు ఔతాడు.
సప్తమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, ఔన్నత్యం కల వాడు, ధనసంపన్నత కలిఉగిన భార్య కలిగిన వాడు, అందమైన వస్తధారణ చేయువాడు ఔతాడు.
అష్టమ స్థానమున ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగిన వాడు, చిరంజీవి, కుటుంబానికి అండగా ఉండే వాడు, ప్రభువు లేక సైన్యాధ్యక్షుడు ఔతాడు.
నవమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్య, ఐశ్వర్యం, సచ్చరిత్ర, ఆచారము, ప్రావీణ్యం, స్వచ్ఛమైన పలుకులు కలిగిన వాడు ఔతాడు.
బుధుడు దశమస్థానమున ఉన్న జాతకుడు మంచి విద్య, సకలకార్య విజయం, శక్తివంతుడు, మేధా సంపన్నుడు, సుఖము కలవాడు, సత్ప్రవర్తన, సత్యవాక్కు పలుకు వాడు ఔతాడు.
ఏకాదశ స్థానమున ఉన్న జాతకుడు చిరంజీవి, సత్యసంధుడు, బహుధనవంతుడు, సుఖజీవి, సేవాజనము కలవాడు ఔతాడు.
ద్వాదశ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు కష్టజీవి, విద్యాహీనుడు, నమ్రత కలిగిన వాడు, క్రూరుడు, తేజోహీనుడు ఔతాడు.

No comments:

Post a Comment